Jeevitam

ప్రేమతో సేవ చేయండి


చరిత్రలో మన కాలానికి సంబంధించిన పరస్పర విరుద్ధమైన అంశాలెన్నో ఉన్నాయి.
మనం పెద్ద పెద్ద భవంతులు నిర్మించాం. కానీ చిన్న చిన్న వాటికే కోపం తెచ్చుకుంటాం. విశాలమైన రహదారులు వేసుకున్నాం. దృక్పథాలను ఇరుకు చేసుకున్నాం. ఎక్కువ ఖర్చు చేస్తాం. తక్కువ పొందుతాం. అధికంగా కొంటాం. తక్కువ ఆస్వాదిస్తాం. మనకు పెద్ద పెద్ద ఇళ్లుంటాయి. కానీ కుటుంబాలు మాత్రం చిన్నవి. చాలా సదుపాయాలుంటాయి. వాటిని అనుభవించడానికి సమయమే లేదు. మన ఖాతాలో ఎన్నో డిగ్రీలు. వివేకం మాత్రం అరకొర. జ్ఞానానికేం, చాలా ఉంటుంది. కానీ సరిగ్గా అంచనా వేయనేలేం. నిపుణులు చాలామంది.అంతకు మించిన సమస్యలు. ఔషదాలు అనేకం. ఆరోగ్యం అంతంతమాత్రం.
మనం ఎక్కువగా మందు తాగుతాం, హద్దులు దాటి దమ్ము కొడతాం, నిర్లక్ష్యంగా గడుపుతాం, వేగంగా బండి నడుపుతాం. అతి తక్కువ నవ్వుతాం. క్షణంలో కోప్పడతాం. పనికి లేటుగా వస్తాం. కానీ త్వరగా అలసిపోతాం. పుస్తకాలు తక్కువ చదువుతాం. టీవీ ఎక్కువ చూస్తాం. అప్పుడప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తాం.
ఆస్తులు రెట్టింపు చేసుకున్నాం. విలువలను తగ్గించుకున్నాం. చాలా ఎక్కువ మాట్లాడతాం. అరుదుగా ప్రేమిస్తాం. తరచూ ద్వేషిస్తాం.
మనం జీతం ఎలా సంపాదించాలో తెలుసుకున్నాం. కానీ జీవితాన్ని ఎలా గడపాలో తెలుసుకోలేదు. జీవించే కాలాన్ని పెంచుకున్నాం. కానీ జీవితంలో జీవం ఉండటం లేదు. చంద్రుడి దగ్గరికి వెళ్లి వచ్చేయడం మనకు చాలా తేలిక. కానీ రోడ్డు దాటి అవతల ఉన్న వ్యక్తిని పలకరించడం కష్టం. అంతరిక్షాన్ని గెలిచాం. అంతరంగాన్ని కాదు. మనం పెద్ద పెద్ద విషయాలను సాధించామేమోగానీ మంచి విషయాలను మాత్రం కానే కాదు.
గాలిని శుభ్రం చేశాం. ఆత్మను కలుషితం చేసుకున్నాం. అణువుల్ని ఛేదించాం. దురాభిప్రాయాల్ని తొలగించుకోలేకపోయాం. రాతలు ఎక్కువ. నేర్చుకునేది తక్కువ. ప్రణాళికలు అనంతం. సాధించేది అంతంతమాత్రం. వేగంగా దూసుకుపోవడం నేర్చుకున్నాం కానీ ఓర్పుగా వెచి ఉండటమన్నదే తెలీదు మనకు. ఇంకా ఎంతో సమాచారాన్ని సేకరించాలని మరిన్ని కంప్యూటర్లను కనిపెడుతున్నాం. ఒకరి భావాలను ఒకరు పంచుకోవడమే తగ్గించేశాం.
ఇవి “ఫాస్ట్” ఫుడ్ రోజులు. కానీ అరుగుదల మాత్రం “స్లో”. మనుషులు పెద్దవాళ్లు, వ్యక్తిత్వాలు చిన్నవి. నోట్ల పంట పండిస్తున్నాం. బంధాలను నిస్సారం చేసుకుంటున్నాం. దంపతులిద్దరూ సంపాదించే కుటుంబాలు ఎక్కువే. విడాకులు కూడా అలాగే పెరిగాయి. ఇళ్లు అందమైనవి కట్టుకుంటున్నాం. కుటుంబాలను విచ్ఛినం చేసుకుంటున్నాం. అలుపెరుగని విహార యాత్రలు, డిస్పోజబుల్ డైపర్లు, ఒక్కరోజు బాంధవ్యాలు, విసిరేసుకుంటున్న నైతిక విలువలు, ఊబకాయాలు… ఇవే రాజ్యమేలుతున్నాయిప్పుడు. ఉత్సాహాన్ని తెచ్చుకోడానికి, ప్రాణం పోయడానికి, ప్రాణం తీయడానిక్కూడా మాత్రలు దొరుకుతున్న కాలమిది. షోరూమ్ డిస్ ప్లే ఎన్నో ఉంటాయి. కానీ స్టోర్ రూమ్ లో సరుకు మాత్రం నిండుకుంటుంది. 
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందంటే, నా సందేశం మీకు క్షణంలో చేరుతుంది. నా అంతరార్థాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. నేను వెలిబుచ్చిన భావాల్ని మీరు ఇతరులతో పంచుకోవచ్చు లేదా ఒక క్షణంలో డిలీట్ చేసి పారేయొచ్చు. అంతా క్షణంలోనే.
ఇలాంటి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి.
మీరు ప్రేమించేవారితో ఇప్పుడే వీలైనంత సమయాన్ని గడపండి. మీరెలా ఉన్నా వాళ్లెప్పుడూ మీ చుట్టూనే తిరుగుతారని లేదు కదా.
కష్టంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తితో ప్రేమగా ఒక్క మాట మాట్లాడండి. ఈ రోజు తక్కువవాడనుకున్న ఆ వ్యక్తి రేపు చాలా గొప్పవాడైపోవచ్చు. మీకు అందనంత దూరమైపోవచ్చు.
సాటి వ్యక్తిని ఆప్యాయంగా కౌగిలించుకోండి. ఎందుకంటే ఎటువంటి ఖర్చూ లేకుండా మీరు మనస్ఫూర్తిగా వారికి ఇవ్వగలిగే కానుక అదొక్కటే. 
ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. జీవితాన్ని మన ఉచ్ఛ్వాస నిశ్వాసల సంఖ్యని బట్టి కాదు, మన శ్వాసను స్తంభింపజేసిన మధుర క్షణాలతో లెక్కించుకోవాలి.
వీలైతే ఈ సందేశాన్ని మరికొందరికి పంపండి. ఒకవేళ పంపకపోయినా మిమ్మల్ని అడిగేవాళ్లెవరు?
స్వేచ్ఛానువాదం: సమీర నేలపూడి